అందరికీ నమస్కారం 🙏
నా పేరు డాక్టర్ రాఘవ, ముగ్గురు అమ్మాయిల తర్వాత పుట్టిన వంశాకురాన్ని అని మా తాత గారి పేరు పెట్టారు రాఘవ నారాయణ అని. 🤔
ఎమ్.ఎ(ఎకనామిక్స్) పూర్తయిన తర్వాత అర్థ శాస్త్రంలో అద్వితీయమైన పరిశోధన చేసానని యూనివర్సిటీ వారు పిహెచ్.డి పట్టాతో పాటుగా ఇచ్చిన గౌరవం నా ముందు ఉన్న డాక్టర్ గారు. నిజానికి ఈ డాక్టర్ గారికి ఇప్పటికీ సూది మందు అంటే కించిత్ భయమే.😃
మాది ప్రకాశం జిల్లాలో ఒక చిన్న గ్రామం, ఒంగోలు నుండి యిరవై నిమిషాల ప్రయాణం. మా నాన్నగారు అప్పట్లో డిగ్రీ వరకూ చదుకున్నా ఊరి మీద ప్రేమతో, తన తండ్రి గారి పట్ల గౌరవంతో వ్యవసాయానికే మొగ్గు చూపారు. తాత గారి మరణానంతరం పూర్తిగా వ్యవసాయానికే అంకితం అయిపోయారు. ముగ్గురు అక్కలకి సలక్షణమైన సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేసారు. నా కోరిక మేరకు నన్ను చదివించారు. ఒక రైతుగా ఈనాటికీ సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నారు. 👍
అమ్మ, భర్త అడుగుజాడల్లో నడుస్తున్న సాధారణ గృహిణి. మా ఊర్లో ఉన్న కోదండ రామాలయంలో ఉన్న రాముడంటే వల్లమాలిన భక్తి. ☺️
ఇక మా బామ్మ, తాత గారు కాలం చేసాక ఇంటి బాధ్యతలు అమ్మకి అప్పజెప్పి నిరంతర దైవ నామస్మరణే కాలక్షేపంగా రోజులు వెళ్ళదీస్తుంది.🙏
ఇదండీ! క్లుప్తంగా మా కుటుంబ చరిత్ర.
ఇక నా స్వవివరాల లోకి వెళితే.....
చదువు అయిపోగానే గ్రూప్ వన్ సెలక్షన్స్ కి పట్టు వదలని విక్రమార్కుని లాగా రెండు సార్లు పోటీ పడి ఒకసారి వ్రాత పరీక్షలో, మరోసారి ఇంటర్వ్యూలో భంగపడి మన అదృష్టం ఇంతే అనుకుని గ్రూప్ టూ సర్వీసుకే పరిమితమై కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశదిమ్మరిగా తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో ఓ మోస్తరు బరువైన, గౌరవప్రదమైన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ప్రస్తుతానికి ఢిల్లీలో మకాం. 😉
నా భార్య పేరు శ్యామల. బి.యస్సీ(కంప్యూటర్స్) చదువుకుంది. నా దృష్టిలో గృహిణిగా నూటికి నూరు మార్కులు సాధించిన మహిళ.👏
శ్యామలని మొదటిసారి మా చిన్నక్క పెళ్ళిలో చూసాను. తను మా చిన్న బావగారికి పిన్ని గారి కూతురు. చూడగానే నచ్చేసింది. పెళ్లిలో ఆమెనే ఫాలో అవుతూ చూస్తూనే ఉన్నాను. నా చూపులు గమనించిన శ్యామల మొదట సందేహంగా చూసింది. కాసేపటికి ఒక చిరునవ్వు విసిరింది. ఇద్దరం కళ్ళతోనే పలకరించుకున్నాము. పలకరించే ధైర్యం చేసే లోపే పెళ్లి తంతు ముగిసింది, అప్పగింతలు పూర్తవగానే పెళ్లి వారితో పాటు శ్యామల కూడా వెళ్ళిపోయింది. చిన్న పలకరింపు కూడా లేకుండానే మా మొదటి కలయిక ముగిసింది. పెళ్లి పనులు అయిపోగానే నేను కూడా అప్పుడు ఉద్యోగం చేస్తున్న బెంగళూరు వెళ్ళిపోయాను. కానీ, శ్యామల ప్రతిరోజూ గుర్తుకొస్తూనే ఉంది. ఆమెని మర్చిపోవడం నాకు సాధ్యపడలేదు. 😟
నాలుగు నెలలు గడిచాయి, కానీ శ్యామలను మాత్రం మర్చిపోలేక పోతున్నాను.
చిన్నక్కకి ఫోన్ చేసి విషయం చెప్పేసాను. చిన్నక్క అంతా విని "సర్లే! నేను మీ బావగారికి చెప్పి వాళ్ళ నాన్నగారితో మాట్లాడమంటాను, ఆయన మాట్లాడినాక ఏ సంగతీ ఫోన్ చేస్తాలే" అంది.
చిన్నక్క దగ్గర నుండి ఫోన్ కోసం ఎదురుచూస్తుంటే నాలుగు రోజుల తర్వాత చిన్నక్క ఫోన్ చేసి శుభవార్త చెప్పింది, వాళ్లింట్లో ఒప్పుకున్నారని, త్వరలోనే వెళ్లి నాన్నగారితో మాట్లాడతారని చెప్పింది.
అలా ఇరువైపుల పెద్దల్ని ఒప్పించి వాళ్లందరి ఆశీస్సులతో ఓ శుభముహూర్తాన శ్యామల నా జీవిత భాగస్వామి అయింది.
కాలం గిర్రున తిరిగిపోతోంది, మా మొదటి వెడ్డింగ్ యానివర్సరీ వచ్చేసింది. ఆ రోజు సాయంత్రం శ్యామల ఒంట్లో నలతగా ఉందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, చెకప్ రూం లోకి వెళ్లి వచ్చిన శ్యామల నవ్వుతూ వచ్చి నా ప్రక్కన కూర్చుంది.
తన భుజం మీద చెయ్యేసి "ఎలా ఉంది శ్యామల? డాక్టర్ గారు ఏమన్నారు" కొంచెం కలవరపడుతూనే అడిగాను.
తను నవ్వుతూ "థాంక్స్ రాఘవా! నాకు మాతృత్వాన్ని ప్రసాదించినందుకు" అంటూ తన భుజమ్మీద ఉన్న నా చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకుంది.
నేను తండ్రి కాబోతున్నానని తెలిసే సరికి చాలా గర్వంగా అనిపించింది. "టేక్ కేర్ ఆఫ్ హర్ హెల్త్"అని చెప్పిన డాక్టర్ గారికి థాంక్స్ చెప్పి యిద్దరం ఇల్లు చేరుకున్నాం.
మర్నాడు ఉదయం నాన్నగారికి ఫోన్ చేసి విషయం చెప్పాను, చాలా సంతోషించారు, ఫోన్ అమ్మకి ఇవ్వమన్నాను,
"రాఘవా! మీ నాన్నగారు చెప్పింది నిజమేనా? ఎంత మంచి శుభవార్త చెప్పావురా? అమ్మాయి ఎలా ఉంది?" అమ్మ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.
"తను బాగానే ఉంది, అమ్మా! నీతో ఒక విషయం చెప్పాలి, అది మేమిద్దరం ఆలోచించి తీసుకున్న నిర్ణయం, పుట్టబోయే బిడ్డ ఎవరైనా ఒకరితో ఆపేద్దాం అనుకుంటున్నాం"
"అదేంట్రా! ఒకవేళ ఆడపిల్ల పుడితే మన వంశాంకురం లేకుండా ఎలారా?" అమ్మ మాటలు నిరుత్సాహంగా వినబడుతున్నాయి.
"అదేదో మగబిడ్డే పుట్టేలా చూడమని నీ రాముడికి చెప్పుకోవే" పక్కనుండి నాన్న గొంతు వినబడింది.
మొత్తానికి మా అమ్మ కోరిక రాముడు విన్నాడేమో?
2011వ సంవత్సరం ఏప్రియల్ నెల 12వ తారీఖున స్వస్తిశ్రీ ఖర నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి అనగా శ్రీరామనవమి పర్వదినాన ఉదయం 10 గంటల 17 నిమిషాలకు శ్యామల పండంటి మగబిడ్డకు జన్మ నిచ్చింది.
నా ఆనందానికి అవధులు లేవు. అమ్మ సంతోషం పట్టలేక నన్ను గట్టిగా హత్తుకొని ఆనంద బాష్పాలు రాల్చింది.
అలా పుట్టాడు మా అబ్బాయి, అన్నట్టు వాడి పేరు "తేజోరాం". మేము ముద్దుగా 'తేజూ' అని పిలుస్తాం.
వాడికి ఇప్పుడు తొమ్మిదేళ్లు. ఇతర రాష్ట్రాలలో చదవడం, కేంద్రీయ విద్యాలయాల్లో చదువు వాడికి తెలుగు భాష మీద పట్టు లేకుండా పోయింది. అర్థం చేసుకోగలడు కానీ స్పష్టంగా మాట్లాడలేడు.
మాయింట్లో నేనే ఆఖరి వాడిని కావడంతో నా పెళ్లి తర్వాత పెద్దగా కార్యక్రమాలు ఎమీ జరగలేదు. తేజూకి ఊహ తెలియనప్పుడు మూడు నాలుగుసార్లు మా ఊరెళ్ళాం. వాడు స్కూల్ కి వెళ్ళడం మొదలయ్యాక వాడినీ, శ్యామలని తీసుకుని మా ఊరికి వెళ్ళలేదు. అప్పుడప్పుడు నేను మాత్రమే వెళ్తున్నాను.
ఇప్పుడు తేజూకి ఊహ తెలుస్తున్న వయసు, చదువు పేరుతో వాడికి చెందవలసిన ఆనందాలు మిస్ చేయడం తప్పనిపించింది.
అందుకే ఈ యేడాది సంక్రాంతి పండుగకి అందరం మా ఊరెళదామని నిర్ణయించుకున్నాం. తెల్లవారితే భోగి పండుగ అనంగా ముందు రోజు సాయంత్రానికి మా ఊరు చేరుకున్నాం.
ఆటో దిగి సామాన్లు దింపుకొని ఇంట్లోకి వెళుతుంటే పరిసరాల్ని ఆశ్చర్యంగా చూస్తున్నాడు తేజూ. మమ్మల్ని చూసి ఆనందంతో ఎదురొచ్చింది అమ్మ. తేజూ ఆమె వంక కొత్తగా చూస్తున్నాడు. "తేజూ! గ్రాండ్ మా" అన్నాను. అమ్మకి దగ్గరగా వెళ్ళి నిల్చున్నాడు. వాడ్ని దగ్గరకు తీసుకొని ముద్దు చేసింది అమ్మ.
బామ్మ దగ్గరకు తీసుకొని వెళ్ళాను, ఆమె మంచం మీద కూర్చుని నవ్వుతూ చూస్తున్నాడు.
"నాన్నగారు ఎక్కడికి వెళ్ళారమ్మా" అమ్మని అడిగాను.
"చేను వైపు వెళ్ళినట్లున్నారు, వచ్చేస్తారులే" అంది అమ్మ.
పండక్కి చిన్నక్క, బావ వాళ్ళ ఐదేళ్ల పాప జానకీ కూడా వచ్చారు. పెద్దక్క, రెండో అక్క వాళ్ళు అమెరికాలో ఉంటారు. వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు చూసి వెళుతుంటారు.
చీకటి పడే వేళకి నాన్నగారు వచ్చారు. పెద్ద మీసాలు, ఆరడుగుల మనిషి, పంచెకట్టుతో కనిపిస్తున్న నాన్నగారిని చూసి తేజూ భయంగా వాళ్ళమ్మ పక్కకి వెళ్ళి నిల్చున్నాడు. నాన్నగారు తేజూ వంక చూస్తూ "ఏవిట్రా! మీ అమ్మ చాటున దాక్కుని చూస్తున్నావు" అనగానే వాడు ఇంకొంచెం వాళ్ళ అమ్మ వెనక్కు జరిగాడు.
"తేజూ! హి ఈజ్ యువర్ గ్రాండ్ పా, గో అండ్ విష్ హిమ్" చెప్పింది శ్యామల. నాన్నగారు నా వంక అదోలా చూసారు.
"హాయ్ గ్రాండ్ పా"అంటూ నాన్నగారి దగ్గరకు వెళ్ళాడు. వాడి తల మీద ఆప్యాయంగా నిమిరి మౌనంగా ఇంట్లోకి వెళ్ళిపోయారు నాన్నగారు. భయంభయంగా, అందర్నీ కొత్తగా చూస్తూ ఆ పూట గడిపేసి రాత్రికి నా పక్కనే పడుకున్నాడు.
తెల్లవారుజామున ఇంటి ముందు భోగి మంటలను వేస్తున్నారు. కాసేపు అక్కడ కూర్చుందామని వెళ్తుంటే తేజూ కూడా వచ్చాడు. వాడికి అన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి.
హరిదాసు, గంగిరెద్దుల వాళ్ళు, ఇంటి ముందు ముగ్గులు, వాటి మధ్యలో పెట్టిన గొబ్బెమ్మలను చూస్తుంటే వాడికి ఏదో వేరే ప్రపంచం లోకి వెళ్ళినట్లుగా అనిపించింది.
తలకి నూనె రాసి, వంటికి నలుగు పిండి పట్టించి స్నానం చేయించడం, అమ్మ చేసిన పిండివంటలు, తలపైన పోస్తున్న భోగిపళ్లు, అన్నింటినీ మించి చిన్నక్క వాళ్ళమ్మాయి జానకితో ఆటలు, వీటన్నింటినీ ఆస్వాదిస్తూ తేజూ మొహంలో కనిపిస్తున్న ఆనందం నాకు, శ్యామలకి చెప్పలేని సంతోషాన్ని కలిగిస్తోంది. మొదటి రోజు వాడిలో ఉన్న బెరుకు, భయం కనుమ పండుగ నాటికి పూర్తిగా పోయింది. నాన్నగారి దగ్గరకు కూడా స్వతంత్రంగా వెళ్లి పక్కనే కూర్చుంటున్నాడు.
కానీ, వాడు ఇంగ్లీషులో అడుగుతున్న ప్రశ్నలకు నేను, శ్యామల ఇంగ్లీషులో సమాధానాలు చెప్తుంటే నాన్నగారు మా వంక చూస్తున్న చూపులు మాత్రం బాణాల్లాగా గుచ్చుకుంటున్నాయి.
మొత్తానికి పండుగ మూడు రోజులు చాలా ఉల్లాసంగా గడిచాయి. కనుమ వెళ్ళిన మరుసటి రోజు చిన్నక్క వాళ్ళు వాళ్ళ ఊరికి బయలుదేరారు. తేజూ జానకి వంక దిగులుగా చూస్తూ వాళ్ళమ్మ పక్కనే నిల్చున్నాడు. ఇంతలోనే ఒక్క ఉదుటున ఇంట్లోకి పరిగెత్తాడు. శ్యామలకు అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తుంది.
లోపల్నుండి తేజూ వాడి కిష్టమైన టాకింగ్ డాల్ బొమ్మని తీసుకొచ్చి జానకి చేతిలో పెట్టాడు. జానకి సంతోషంతో ఆ బొమ్మ తీసుకుని గుండెలకి హత్తుకుంది. మడతకుర్చీలో కూర్చొని నాన్నగారు అన్నీ గమనిస్తున్నారు. వాళ్ళ ఆటో వీధి మలుపు తిరిగేవరకూ గుమ్మంలోనే నిల్చుని చేయి ఊపి దిగాలుగా లోపలికి వచ్చాడు. రేపు ఢిల్లీకి తిరిగి వెళ్ళిన తర్వాత కొంపదీసి వీడు వీళ్ళందరి కోసం దిగులు పడడు కదా అనుకుంటూ నేను కూడా లోపలికి నడిచాను.
ఆ మరుసటి రోజు మా తిరుగు ప్రయాణం. శ్యామల వాళ్ళ నాన్నగారు రిటైరైన తర్వాత వాళ్ళు విజయవాడలో స్థిరపడ్డారు. వాళ్ళింట్లో రెండు రోజులుండి ఢిల్లీ చేరుకోవాలి.
"శ్యామలా! అన్నీ సర్దుకున్నావా? ఏమీ మర్చిపోలేదుగా?" అంటూ శ్యామలకు గుర్తు చేస్తూ ఆటో ఇంకా రాలేదని గుమ్మం వంక చూస్తున్నాను.
లగేజ్ అంతా వరండాలోకి చేర్చిన తర్వాత నేను, శ్యామల బామ్మకి, అమ్మకి కాళ్ళకి నమస్కరించి నాన్నగారి దగ్గరకు వెళ్ళాం. ఇద్దరం ఆయన పాదాలు తాకగానే తన రెండు చేతులతో మా తలపైన నిమిరి మౌనంగా ఉండిపోయారు.
భారమైన హృదయంతో అమ్మని చూస్తుంటే,
"రాఘవా"అంటూ నాన్నగారు గొంతు వినబడింది, నాన్నగారికి దగ్గరగా వెళ్ళి నిలబడ్డాను, నాతో పాటే శ్యామల కూడా వచ్చింది.
"మనం దేశాంతరాలలో ఉన్నా, రాష్ట్రేతరంగా ఉన్నా, విధి నిర్వహణలో ఎన్ని వత్తిడులున్నా, మన ఇంట్లో మాతృభాషలో మాట్లాడటం, మన పిల్లలకి మాతృభాషని నేర్పడం, సంస్కృతి, సాంప్రదాయల పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేయడం తల్లిదండ్రుల బాధ్యత అని ఉన్నత చదువులు చదువుకున్న మీకు నేను గుర్తు చేయనవసరం లేదను కుంటున్నాను.
రాఘవా! నువ్వు సంపాదిస్తున్న దానితో వాడు కోరుకున్న ఏ వస్తువునైనా కొనీయగలవేమో కానీ అమ్మ ప్రేమ లాంటి మాతృభాషని మాత్రం ఎంత ద్రవ్యం వెచ్చించినా అందించలేవు. అది కేవలం మీ ఇద్దరి వలనే సాధ్యం.
శ్యామలా! చదువుకున్న దానివి, మాతృభాష యొక్క ఆవశ్యకత నీకు నేను వేరే చెప్పాలామ్మా? రోజుకి ఒక గంటసేపు పిల్లలకి మన మాతృభాష గురించి, సంస్కృతి సాంప్రదాయల గురించి చెబితే అది మనం తీర్చుకునే మాతృఋణం లాంటిదేనని మాతృత్వం పొందిన తర్వాత కూడా విస్మరించావు.
అందుకే మీరు ఎంత పని ఒత్తిడిలో ఉన్నా ఏడాదికి ఒకసారి ఇలా పిల్లలతో స్వగ్రామానికి వస్తుంటే మాకు ఈరోజు ఇలా వాడి నోటితో గ్రాండ్ పా అనో, గ్రాండ్ మా అనో పిలిపించుకునే దౌర్భాగ్యం తప్పేది.
తల్లిదండ్రులుగా మీరు విస్మరించిన విషయాన్ని ఇంటి పెద్దగా గుర్తు చేద్దామని చెప్పాను. ఈసారి మళ్ళీ మీరు వచ్చేనాటికి వాడు మమ్మల్ని చూసి తాతయ్య నానమ్మ అంటూ అక్కున చేరే అదృష్టాన్ని ప్రసాదించండి, అది చాలు మా జన్మ సార్థకం అవటానికి"
నాన్నగారి మాటలకి ఏమని జవాబివ్వాలో తెలియక మా అసమర్థతను నిందించుకుంటూ మౌనంగా ఉండిపోయాను.
"క్షమించండి మామయ్య గారు! మీరు చెప్పింది అక్షర సత్యం, తేజూ విషయంలో నేను చేస్తున్న పొరపాటును గుర్తు చేశారు. వాడు కడుపులో పడ్డాడని తెలిసిన రోజు కలిగిన ఆనందం ఇప్పుడు నాకు కలగడం లేదు. మీరు చెప్పినట్లు వాడికి మన భాష, సంస్కృతులను నేర్పగలిగిన రోజు నా మాతృత్వానికి అర్థం, తప్పకుండా నేర్పిస్తానండి" కళ్ళ నీళ్ళు చెంగుతో తుడుచుకుంటూ భావోద్వేగంతో చెప్పింది శ్యామల.
దూరంగా సూట్కేస్ మీద కూర్చుని ఆసక్తిగా చూస్తున్నాడు తేజూ. నిధానంగా లేచి మౌనంగా బామ్మకి, అమ్మకి నమస్కారం చేసాడు. నాన్నగారి దగ్గరకు వెళ్ళి "తాతయ్య గారూ! అని పిలిచాడు. నాన్నగారి ఆనందానికి అవధుల్లేవు, వాడ్ని గట్టిగా హత్తుకొని సంబరపడి పోయారు.
గుమ్మంలో ఆటో వచ్చింది. అమ్మ దిగులుగా చూస్తుంది. సామాన్లన్నీ ఆటోలో సర్ది "వెళ్ళొస్తాం నాన్నగారు" అన్నాను. మంచిదన్నట్లుగా తలూపారాయన.
"తాత గారూ! మళ్ళీ పండుగ ఎప్పుడొస్తుంది?" అడిగాడు తేజూ. "మీరెప్పుడొస్తే అప్పుడే మాకు పండుగరా" అంటున్న నాన్నగారి మాటల్లో అంతరార్థం గ్రహించి నాలో నేను సిగ్గుపడుతూ ఆటో ఎక్కాను.
✍ venkatniyogi