Tuesday, April 14, 2020

జుట్టు పోలిగాడు

" ఒరేయ్ తింగరి సన్నాసి! ఆ పిల్లకేం తక్కువరా? మనూరి బళ్లో పదో తరగతి పాసయింది. మొన్న జానకమ్మ గారింట్లో పేరంటానికెళ్తే ఎంత చక్కగా త్యాగరాయ కీర్తనలు పాడిందో? వంటా వార్పూ దివ్యంగా చేస్తుందట, పిల్ల కూడా కుందనపు బొమ్మల్లే ఉంటుంది, నీ మొహానికి ఆ పిల్లని చేసుకోవడమే ఎక్కువరా బడుద్దాయ్, ఆ జుట్టు చూడు? జుట్టు పోలిగాడన్నా నయం!! "

బామ్మ కేకలకి ఉలిక్కిపడి లేచాను, ఒక్కక్షణం చుట్టూ చూసి "హమ్మయ్య! కలే కదా" అనుకొని కిటికీలోనుండి కనిపిస్తున్న సూర్యుని చూస్తూ వళ్ళు విరుచుకుంటూ నిద్ర లేచాను. అన్నట్టు నా పేరు సూర్యమండీ, పూర్తి పేరు సూర్యనారాయణ మూర్తి, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాను,  ఈరోజు మా ఊరెళ్ళాలి, రేపు నేను మొట్టమొదటి సారిగా పెళ్ళిచూపులకి వెళ్ళబోతున్నాను.
బస్సులో ఒంగోలుకి టిక్కెట్ తీసుకుని కిటికీ పక్కన కూర్చుని పరిసరాల్ని గమనిస్తుంటే రేపు నేను పెళ్ళిచూపులు చూడబోతున్న కృష్ణమూర్తి మాస్టారి పెద్దమ్మాయి లలిత గుర్తొచ్చింది.

" దాదాపు రెండేళ్ళయింది తనని చూసి, మా చెల్లెలు పెళ్ళిలో చూసాను, అప్పట్లోనే చాలా బాగుండేది, మనిషి నిధానస్తురాలే గానీ అప్పుడప్పుడు కొంచెం కోపధారని అంటుండేవారు. ఇప్పుడెలా ఉంటుందో? " అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాను.

టౌను నుండి మా ఊరెళ్ళే ఆటో ఎక్కి లైబ్రరీ సెంటర్లో దిగి ఇంటి దారి పట్టాను. వీధి పంపు దగ్గర అందరూ నా వైపే చూస్తున్నారు. " సీతమ్మ గారి మనవడు, పెద్దాయన కొడుకు, హైదరాబాద్లో ఉద్యోగమంట, ఆ కిట్టమూర్తి పంతుల్లేడూ వాళ్ళ పెద్దమ్మాయిని ఈ అబ్బాయి కిత్తారంట, పెళ్ళిచూపులకి వచ్చాడేమో? ఈడూ జోడూ బానే ఉంటదిలే" మొట్టమొదటి సారి మా ఊళ్లో మా యింటికి వెళ్ళటానికి చాలా కొత్తగా, సిగ్గుగా అనిపించింది.
గుమ్మంలోకి వెళ్ళగానే ఎదురుగా వరండాలో నవ్వారు మంచమ్మీద కూర్చొని తాంబూలం నములుతూ బామ్మ కనిపించింది. " ఏరేయ్ వెర్రి నాగన్న! ఇదేనా రావడం? ఏవమ్మా! నీ కొడుకొచ్చాడు చూడు " అంటూ అమ్మని కేకేసింది. ఆ పిలుపులో దర్పమో, పెద్దరికమో, ఆప్యాయతో.. ఏముందో నాకు ఇప్పటికీ అర్థం కాదు.
" రా రా! ఎలా ఉన్నావు? " అంటూ చేతిలో సూట్కేస్ తీసుకుని లోపలికి వెళుతున్న అమ్మ వైపే చూస్తూ కాళ్ళు కడుక్కొని బామ్మ పక్కన మంచమ్మీద కూర్చున్నాను. అమ్మ యిచ్చిన కాఫీ తాగుతుంటే ఏదో తెలియని ప్రశాంతత ఆవహించినట్లయింది. నా పెళ్ళిచూపులని నెల్లూరు నుండి చెల్లి బావగారు కూడా వచ్చారు.
స్నానం చేసి అలా చిన్నప్పటి స్నేహితుడు మురళీ వాళ్ళింటిదాకా వెళ్లొద్దామని బయల్దేరాను. మురళీ వాళ్ళింటికి కృష్ణమూర్తి మాస్టారి ఇంటి ముందు నుండే వెళ్ళాలి, వాళ్ళ సందులోకి తిరిగాను, మాస్టారి ఇంటి ముందు అరుగుల మీద ఆడవాళ్ళు అందరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. కొంచెం బెరుకుగా అనిపించింది, ఇంతలో ఎవరో హడావిడిగా మాస్టారి ఇంట్లోకి పరిగెత్తారు. బహుశా లలితే అయ్యింటుందని అనుకుంటూ ఎలాగో మురళీ వాళ్ళింటికి చేరుకున్నాను.
కాసేపు పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుని ఇల్లు జేరి భోజనాలు అయినాక ఆరు బయట మంచమేసుకుని రేపటి పెళ్ళిచూపులను తలుచుకుంటూ నిద్రపోయాను.

పొద్దున్నే నిద్ర లేచేసరికి బామ్మ హడావుడి అంతా ఇంతా కాదు. అమ్మ చేతి కాఫీ తాగి తల స్నానం చేసొచ్చాను. రాహు కాలం, వర్జ్యం లెక్కలేసి ఉదయం 10 గంటలకి బయలుదేరమని హుకుం జారీ చేసింది బామ్మ.
అమ్మ, నాన్న, చెల్లి, బావగారు, నేను బయల్దేరాం. బామ్మని కూడా రమ్మంటే "శుభమాని వెళుతూ నేనెందుకురా వెర్రి సన్నాసి, నేను రోజూ చూస్తూనే ఉంటాగా? మీరు వెళ్లి రండి" అంటుంటే "ఈ మూఢాచారాలు ఎవడు కనిపెట్టాడురా" అనుకుంటూ మాస్టారింటికి బయలుదేరాం.
గుమ్మంలోకి ఎదురొచ్చిన మాస్టారు " ఏం బాబూ! బాగున్నావా? " అంటే " బాగున్నాను మాస్టారు " ఎప్పటిలానే అనేసాను. "ఇంకా మాస్టారు ఏంటి? మావయ్య గారూ అనాలి" పక్క నుండి ఎవరో కైంటరేసారు.  అందరం నవ్వుకుంటూ ముందు గదిలో ఏర్పాటు చేసిన కుర్చీల్లో కూర్చున్నాం. మాస్టారి భార్య ఫలహారాలు తీసుకొచ్చారు, నేను మొహమాట పడుతుంటే అమ్మ " పర్వాలేదు తీసుకోరా" అని చిన్నగా చెవిలో గొణిగింది.
" అమ్మాయిని తీసుకుని రమ్మంటారా? " మాస్టారి గొంతులో ఆడపిల్ల తండ్రి వినయం ఏదోలా అనిపించింది.
ఎవరో పెద్దావిడ పక్కన చిన్నగా నడుచుకుంటూ వచ్చి ఎదురుగా ఉన్న చాప మీద కూర్చుంది లలిత. నాకు తెలియకుండానే తల వంచుకుని నేల చూపులు చూస్తున్నాను.  అటు చివర్న కూర్చున్న మా చెల్లి లేచి నా కుర్చీ వెనక్కు వచ్చి నా చెవిలో  " ఏరా! మా ఫ్రెండ్ ఎలా ఉందిరా" అంది, " నువ్వుండవే తల్లీ! నా కసలే సిగ్గుగా ఉంది" గొణిగాను. " మా అన్నయ్య అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడాలంట" అనేసింది చెల్లి, నా గుండె ఆగినంత పనైంది. " దాన్దేముందమ్మా! అలాగే " అంటూనే " ఉమా! వెనుక వసారాలో రెండు కుర్చీలు వేసి మంచినీళ్లు పెట్టమ్మా" అంటూ కేకేసారు మాస్టారు.

" అలాగే నాన్నగారు! " లోపల నుండి మాస్టారి రెండో అమ్మాయి అనుకుంటా.
మా చెల్లితో వెళ్లి వెనక కుర్చీలో కూర్చున్నాను. వాళ్ళమ్మ గారితో వచ్చి నా ఎదురుగా కుర్చీలో కూర్చుంది లలిత.
మరుక్షణంలో మా వెంట వచ్చిన వాళ్లు మాయమైపోయారు. కాస్త ధైర్యం చేసి పైకి చూసాను, తల వంచుకుని కూర్చుంది లలిత, " యాక్చువల్గా మా చెల్లితో నేనేమి చెప్పలేదు లలితా" అన్నాను. "నాకు తెలుసు" చాలా కాలం తర్వాత లలిత గొంతు విన్నాను. "ఏమన్నా మాట్లాడు లలిత" అన్నాను.
"మిమ్మల్నొక విషయం అడగొచ్చా? " అంది లలిత,
"అడుగు లలిత" అన్నాను, "మీకూ..... తిరుపతి మొక్కేమైనా ఉందా? అహా! మరేం లేదు, బయట మిమ్మల్ని అందరూ జుట్టు పోలిగాడు అంటున్నారు, నాక్కూడా అలాగే అనిపించింది, ఒకవేళ మొక్కేమైనా ఉందేమో అలా అనుకుంటే పాపం తగులుతుందని అడిగాను" అని పెద్దగా నవ్వేసింది.
ఒక్క క్షణం నా బుర్ర తిరిగి పోయింది. రెండంటే రెండే అంగల్లో బయట కుర్చీలోకి వచ్చి కూర్చున్నాను. "ఏరా ఏంటి సంగతి? " అంటూ దగ్గరికి వచ్చింది చెల్లి.
" నిన్నూ....! భలే ఇరికిస్తావే తల్లీ నువ్వు" అని కళ్ళు పెద్దవి చేసాను. "మా అన్నయ్యకి లలిత నచ్చిందంట" గట్టిగా అరిచేసింది చెల్లి రాక్షసి.
" ఒంగోలు, ఒంగోలు " కండక్టర్ కేకతో కళ్ళు తెరిచి చుట్టూ చూసాను, ఒంగోలు బస్టాండ్, అయ్యో! ఇదంతా కలేనా అనుకుంటూ పైన పెట్టిన సూట్కేస్ తీసుకుని బస్ దిగి బస్టాండ్ బయటకొచ్చి టీ స్టాల్ దగ్గరికి నడిచాను. వేడిగా టీ తాగి చుట్టూ వెతుక్కుంటున్నాను ఎక్కడుందా? అని..
ఏంటండీ! దేనికోసం వెతుకుతున్నానో అర్థం కాలేదా?
సెలూన్ షాప్ కోసం, హెయిర్ కట్ చేయించుకోవాలిగా"
✍ @venkatniyogi

No comments:

Post a Comment

చేయెత్తి జైకొట్టు తెలుగోడా!

చిత్రం:పల్లెటూరు (1952), రచన:వేములపల్లి శ్రీకృష్ణ సంగీతం:ఘంటసాల, గానం:ఘంటసాల, బృందం పల్లవి: చేయెత్తి జైకొట్టు తెలుగోడా! గతమెంతో ఘనకీ...