Tuesday, April 14, 2020

ఊరెమ్మటి మల్లెతోట

( ఉదయం 10 గంటలు )
రేయ్ రాముడూ! ఆ తూరుప్పక్క నాలుగెకరాల కొబ్బరి తోటలో రేపు కాయలు దించండి, బేరగాళ్ళొచ్చి బయానా యిచ్చారు....
ఆ పంపు కాడ గట్టు మీద కూసుందెవర్రా? ఆ మోటార్ కట్టు, తోట నిండిపోతుంటే కనపట్టల్లా?
రేయ్ ఓబులూ! ఆ ట్రాక్టరేసుకుని టౌనుకు పోయి జగన్నాథం కొట్లో మందు కట్టలెత్తుకురా, రేపు ఆ ఉత్తరప్పక్కన చేలో మందు కొట్టించు...
( మధ్యాహ్నం ఒంటిగంట )
ఎవర్రా అక్కడ! యింటి కాడ్నుండి క్యారేజొచ్చిందా?
మామిడి చెట్టు కింద మంచమేసి ఆడపెట్టు, పంపు కాడ కాళ్ళు కడుక్కొస్తా...
ఈరిగాడేడిరా? ఆడ్ని క్యారేజీ తీసుకుని ఈడకి రమ్మను..
రారా ఈరిగా! కూర్చో... ఏమేసిందిరా మంగమ్మ తింటానికి?
దా! రెండు చికెన్ ముక్కలేసుకో, తిన్రా! మీ అమ్మగారు బాగా చేస్తదంటావుగా?
ఏందోరా ఈరిగా! రాన్రానూ వ్యవసాయం భారమై పోతుందిరా!! పంటమ్మితే పెట్టుబడి కూడా రాటంలేదు,
పై ఏటి నుండి వ్యవసాయం తగ్గిద్దామని ఆలోచిస్తున్నా!!
ఐదో తరగతి దాకా కలిసి చదువుకున్నాం, ఒక ఈడోళ్ళతో చెప్పుకోకపోతే ఎవరికి చెప్తాం చెప్పు?
టౌన్లో మా పెద్దోడి స్నేహితుడున్నాడ్రా, రియలెస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు,
ఆడికి ఆ ఊరెమ్మట ఐదెకరాల మల్లెతోట కావాలంట్రా,
ఇంటి స్థలాల కింద అమ్ముతాడంట, డబ్బుల కోసం కాదెహె, మా అమ్మ బాబు యిచ్చిపోయింది చాల్దేంట్రా?
నా చేతులతో బీడు పెట్టడం కంటే అదే నయం అనిపిస్తుంది, ఆలోచిద్దాంలే....

( సాయంత్రం ఐదు గంటలకు )
ఏంటి బాబాయ్ రమ్మన్నారంట? యేసుబాబు గాడు చెప్తే బండిటు తిప్పా, ఏం బాపినీడు గారు, సత్తిబాబు! అందరూ కచేరీ కాడికి చేరరేంది సంగతి?
నిజమే బాబాయ్! మొన్నాపక్కగా పోతా చూసా, ఊర్లో బడి పడిపోయేట్టుగానే ఉంది, పిల్లకాయలకి ఏమైనా అయితే ఊరికి మాటొస్తది...
ఎంత పని బాబాయ్! తలా ఓ చెయ్యేస్తే రేపు ఎండాకాలంలో కట్టేయచ్చు... కానీ....
ఊర్లో పిల్లలు ఎక్కువగానే ఉన్నారు, రాబోయే రోజుల్ని కూడా ఆలోచిస్తే స్థలం సరిపోదేమో అనిపిస్తుంది...
ఎవరో ఒకరు పెద్ద మనసు చేసుకోపోతే సమస్య ఎట్లా తీరుద్ది చెప్పండి?
సరే! ఓ పన్జేద్దాం, నాకు ఆ ఊరెమ్మట మల్లెతోట ఉందిగా?
సరిగా కాపు కూడా రాటం లేదు, ఆ స్థలం మనూరి పంచాయతీకి రాసిస్తాలే, విపులంగా బడీ అమరుద్ది, పోరలు ఆడుకుంటానికి జాగా కూడా సరిపోద్ది. కట్టుబడికి ఓ రెండు లక్షలిస్తాలే!
అమాసెళ్ళగానే కాగితాలు రాసిస్తా! పంతుల్నడిగి మంచి రోజు మొదలెడదాం
దాన్దేముంది బాబాయ్! నేను సంపాయించింది ఏముంది? వాళ్లిచ్చి పోయిందేగా?
నేను తినే ప్రతి గింజ మీద వాళ్ల పేర్లేగా ఉండేది,
అట్టాగే కానీయండి, అమ్మా నాయన్ల పేర్లే పెడదాంలే!
ఊరున్నంత కాలం వాళ్లని జనం తలచుకుంటారు,
నా కట్టెన్నుంత వరకూ కళ్ళారా చూసుకుంటూ తృప్తి పడతాను. బయల్దేరతాను బాబాయ్, నమస్కారం 🙏
✍ @venkatniyogi

2 comments:

  1. అన్న ..నాకు ఒక డౌట్ ఈ కథల పేరేంటి ..అంటే కథ అంత ఒకళ్ళ సంబాషణ మాత్రమే ఉంది కద అందుకని...అడిగా

    ReplyDelete
  2. చెప్పారుగా మీరే! ఏకపాత్రాభినయం అని 🙏

    ReplyDelete

చేయెత్తి జైకొట్టు తెలుగోడా!

చిత్రం:పల్లెటూరు (1952), రచన:వేములపల్లి శ్రీకృష్ణ సంగీతం:ఘంటసాల, గానం:ఘంటసాల, బృందం పల్లవి: చేయెత్తి జైకొట్టు తెలుగోడా! గతమెంతో ఘనకీ...