Tuesday, April 14, 2020

బండికి టైమయ్యింది

రాయ్యా! బాగున్నావా? అట్లా చిక్కిపోయావేందయ్యా?
అంతేలే! ఆ హోటల్లో తిండి నేనొండినట్లుండదుగా?
ఏమయ్యా! ఏం చేస్తున్నావ్? అబ్బాయి వచ్చాడు చూడు,
ఇంకేందయ్యా సంగతులు? ఉద్యోగం బాగానే ఉందా?
ఆఫీసులో అందరూ మంచోళ్లేనా?
పోయి నూతి కాడ స్నానం చేసిరా, కాస్త గోధుమ నూక ఉడకేసి తాళింపు పెడతా, వేడిగా తిందువుగాని, ఎప్పుడనగా తిన్నావో? ఏమి తిన్నావో?
రా రా కూచో! ఉండు ఇంకాస్త పెట్టనీ...
సీతాలత్తా, రంగడు మావ, వాళ్ళ పిల్లని నీకిస్తామని మీ నాయన ప్రాణం తీస్తున్నారు, వాడు ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాడు, తొందరేంది? చూద్దాంలే అన్నాడు మీ నాయన. నువ్వు ఎప్పుడంటే అప్పుడేలేయ్యా, అదైనా నీకా పిల్ల నచ్చితేనే, లేకపోతే బయటెక్కడైనా చూద్దాం, సరేనా?
అదేందయ్యా ఇవాళొచ్చి రేపే వెళ్ళాలంటావు, నాల్రోజులు ఉండయ్యా, సరేలే ఉద్యోగం యిబ్బంది అయితే వద్దులే, పొద్దున బండికెళుదువు గాని.. కాసేపు నడుం వాల్చు, నీకిష్టమని బొంతొంకాయలు కోసాను, కూరొండి ఎండు చేపలు కాలుస్తా, తిందువుగాని....
ఏయ్యా! అన్నీ సర్దుకున్నావా? ఏం మర్చిపోలేదుగా?
ఇంద సీతాలత్త పంపింది నీకిష్టమని..
సున్నుండలు, కారప్పూస, సంచిలో పెట్టుకో...
ఆరోగ్యం జాగ్రత్తయ్యా! వేళకి తింటుండు, సరేనా?

అయ్యా! నిన్నో విషయం అడుగుతా ఏం అనుకోవుగా?
ఏంలేదయ్యా! ఈ మధ్య మీ నాయన పెద్దగా పన్లోకి పోలేకున్నాడయ్యా, నెల రాబడి తగ్గిపోతోంది, అందుకనీ.. అందుకనీ నీకు ఇబ్బంది లేకపోతే నీ జీతంలో నెల నెలా ఇంటికి వెయ్యి రూపాయలు పంపగలవా? మందు మాకులకి అక్కరకొస్తాయని మీ నాయన అడగలేక నన్ను అడగమన్నాడు. వెయ్యి కాకపోతే నువ్వు ఎంత పంపగలిగితే అంతే...
నువ్వేదో మాకు ఋణమని కాదయ్యా, ఈ ముసలి ప్రాణాలకి కాస్త ధైర్యం ఉంటదనీ...
నీకు ఇబ్బంది అయితే వదిలెయ్యి, మా రోజులెట్లయినా వెళ్ళపోతాయి, ఇప్పుడేమయినా ఆగినాయా? అంతే!
నువ్వు ఈ విషయం ఆలోచించి మనసు కష్టపెట్టుకోమాక!
బండికి టైమయ్యింది బయల్దేరు,
క్షేమంగా పోయిరాయ్యా!
ఏమయ్యా! పిల్లాడు బయల్దేరుతున్నాడు,
స్టేషన్ దాకా పోయి బండెక్కిచ్చిరా..
ఏందయ్యా ఇది?
ఎప్పుడూ లేంది కాళ్ళకి దణ్ణం పెడుతున్నావు?
నా ఆయుష్షు కూడా పోసుకుని
పది కాలాలు చల్లగా ఉండయ్యా...
పోయిరా!
ఒక్క నిమిషం అయ్యా!
ఎదురొస్తాను ఉండు.....
- ✍ Venkat Niyogi

4 comments:

  1. గుండెను పిండే సావ్...అన్న..

    ReplyDelete
  2. చూవుతున్నంతసేపు గుండెను పిండేసింది అన్న గారు

    ReplyDelete

చేయెత్తి జైకొట్టు తెలుగోడా!

చిత్రం:పల్లెటూరు (1952), రచన:వేములపల్లి శ్రీకృష్ణ సంగీతం:ఘంటసాల, గానం:ఘంటసాల, బృందం పల్లవి: చేయెత్తి జైకొట్టు తెలుగోడా! గతమెంతో ఘనకీ...