Friday, April 24, 2020

ఊ.... బాగుంది

ఊ.... బాగుంది రా కృష్ణా!
ఎప్పుడో డిగ్రీ రెండో ఏట మీ నాన్నగారికి చాలా దూరంగా ట్రాన్స్ఫర్ అయిందని వెళ్ళిపోయారు, తర్వాత ఒక జాబు లేదు, పలకరింపు లేదు. అసలు బాగోగులు కూడా తెలియలేదు. ఆ మధ్య చాలా కాలం క్రితం రమేష్ గాడు కనబడితే నీ సంభాషణ వచ్చింది. కాలక్రమంలో నువ్వేదో అమెరికా వెళ్ళి స్థిర పడ్డావని చెప్పాడు. చాలా సంతోషం వేసింది, నా స్నేహితుడు కూడా ఒకడు అమెరికాలో ఉన్నాడని గర్వపడ్డాను. మా షాప్ అడ్రస్ గుర్తు పెట్టుకొని వచ్చావు, ఇప్పుడు నాన్నగారు రావడం లేదులే, పెద్దవారయి పోయారుగా! ప్రస్తుతానికి వ్యాపార బాధ్యతలు నేనే చూసుకుంటున్నాను.
ఏమయినా ఆ రోజులే వేరు కదరా! అప్పట్లో హీరో సైకిల్ అంటేనే ఇప్పటి కుర్రాళ్ళకి బజాజ్ పల్సర్ లాగా అనిపించేది. కాలేజీ, క్రికెట్, సినిమాలు... యివేగా మనలోకం? చాలా మిస్సయ్యాను రా నిన్ను కృష్ణా.
అద్సర్లే! నీ సంగతులు చెప్పు? ఇంకా అమెరికాలోనే ఉంటున్నావా? ఇండియాకి తిరిగొచ్చేసావా? భార్యాపిల్లల సంగతులేంటి?
పోన్లేరా! ఆ దేశంలో ఉన్నంత కాలం ఉన్నా మాతృదేశం మీద ప్రేమతో తిరిగొచ్చేసావు, పదిమందికి అన్నం పెట్టగలిగే స్థాయికి ఎదిగావు. చాలా గర్వంగా ఉందిరా కృష్ణా! నిన్ను నా స్నేహితుడివని చెప్పుకోవటానికి. అదీ సంగతి! కూతురు పెళ్లి వార్తతో వచ్చావన్న మాట. పోనిలే మనిద్దరం ఒకరి పెళ్లి మరొకరం చూసుకోలేక పోయినా కనీసం మన పిల్లల పెళ్లి నాటికయినా కలిసాం. సంతోషం.
పదరా! ఇంటికి వెల్దాం, మీ చెల్లాయిని పిల్లలని చూద్దువుగాని.
అన్నట్టు చెప్పడం మర్చిపోయాను... నీకు గుర్తుందా కృష్ణా?
రోజూ పొద్దునా సాయంత్రం ఉమెన్స్ కాలేజీ వదిలే టైయానికి కాలేజీ దగ్గర తన కోసం వెయిటింగ్, అరండలుపేటలోని వాళ్ళింటి మలుపు దాకా ఫాలో అవ్వడం, మళ్ళీ సాయంత్రం ట్యూషన్ వదిలే వేళకి బ్రాడీపేటలో వెయిటింగ్, వాళ్ళింటి దాకా ఫాలో అవ్వడం, వాళ్ళ అన్నయ్య చూసి ఆ మధు గాడి గ్యాంగుతో గొడవకి రావడం, ఫైటింగ్ సీన్లు గుర్తున్నాయా?
నాకు మాట్లాడే ధైర్యం లేకపోవడం, తనకి మాట్లాడాలనే ఆసక్తి లేకపోవడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది.
అయినా నాకు వెర్రి కాకపోతే నీ గురించి చెప్పడానికి నేను ఫాలో అవ్వడం ఏంటి? మీరు ఊరు నుండి వెళ్ళిపోయారని ఫాలో అవ్వడం మానేసాను.
నెల రోజుల తర్వాత అనుకుంటా శంకర్ విలాస్ సెంటర్లో కనబడింది, నేను తలొంచుకుని వెళ్ళిపోతుంటే తనే పలకరించింది, కనబడటం లేదు ఏమిటని, నా సంగతి నీకు తెలుసుగా! మనకి మాట్లాడాలంటే సిగ్గు, ఏమీ సమాధానం చెప్పకుండా నవ్వి ఊరుకున్నాను. "రేపు ఈవెనింగ్ మా కాలేజీ దగ్గరకి ఎన్నింటికొస్తారూ?" అంది. నేను ఆశ్చర్యంగా చూసాను, తలొంచుకుని నవ్వుతూ "మీరు కనబడకపోతే నాకు ఏదోలా ఉంది, ఎప్పటిలానే రోజూ కనబడండీ, ప్లీజ్" అంది.
తర్వాత ఏమయింది అంటావేరా దుర్మార్గుడా?
మా కొంపలో, వాళ్ళింట్లో తెలిసిపోయింది.  వాళ్ళ బాబు ఓ డజను, మా బాబు అరడజను తిట్లు తిట్టారు. పోనిలే మర్చిపోదాం అనుకున్నా!
కానీ, నీయబ్బ ఒరేయ్! నీ కోసమని వెంటపడ్డ నేరానికి  నేను తాళి కట్టాల్సి వచ్చింది రా బావా!!
పద, ఇంటికెళ్ళాక పరిచయం చేస్తాను.
✍ venkatniyogi

No comments:

Post a Comment

చేయెత్తి జైకొట్టు తెలుగోడా!

చిత్రం:పల్లెటూరు (1952), రచన:వేములపల్లి శ్రీకృష్ణ సంగీతం:ఘంటసాల, గానం:ఘంటసాల, బృందం పల్లవి: చేయెత్తి జైకొట్టు తెలుగోడా! గతమెంతో ఘనకీ...