Tuesday, April 14, 2020

యాదమ్మింట్లా మామిడిచెట్టు

"వారీ! ఎవల్లల్ల ఆకెల్లి? మీ నోట్లల్లా మన్నుబడ, ఏం గత్తరొచ్చినాదిరా, నాగ్గాన దొరికిండ్రా? బిడ్డా! ఒక్కోనికి బొక్కలిరిపి బొంద పెడ్తా మళ్ళా" యాదమ్మ నోరు సగమూరిదాంక ఇనబడుతుండె.
"అయ్యా! ఏమాయినే యాదమ్మ? పోరలను బొందలోపెడ్త నంటుంటివి, ఏంజేస్తిరే అంతమాగం?" శాయన్న సర్దిజెప్ప బోయిండు.
"ఇంగో సూడు శాయన్న! సెట్టు మీద మామిడికాయల్ని బతకనిస్తలేరు, పొద్దాకుల గడ్డలిచ్చుక్కొడుతుండ్రు మంద,  గడ్డలొచ్చి ఇంట్ల పడుతుండే, ఏం జెయ్యాలె, ఆళ్ళింట్ల పీనుగలెల్ల" మళ్ళా తిట్లు సురూజేసింది యాదమ్మ.
"సాల్దియ్! ఆ తిట్లేంది? ఈ ఆగమేంటిది? సిన్న పోరలు కాయలు కొట్టనీకి గడ్డలిసిరిండ్రని గసుంటి గలీజ్ మాటలేంటిది? ఆళ్ళ నే మందలిస్త గానీ, నువ్ లోపటకు పో యిక, చేసినాగం సాలన్నట్లు" శాయన్న అరుపులకి యాదమ్మ ఇంట్లకి పొయ్యి సణుగుతుండె.

యాదమ్మ తిట్లు ఆపేటిది లేదు, పోరలు గడ్డలిసురుడు ఆపేటిదీ లేదు.  దినాలు గడుస్తనే ఉన్నాయి.

ఓ పొద్దుటేళ యాదమ్మ ఇంటికాడ మంది పోగయిండ్రు, ఏదన్న పోరగాళ్ళ తోన లొల్లి గిట్లయినదేమోనని పోయిన, యాదమ్మ మంచమ్మీద పండుకొనుండె, సుట్టూ కాయల కోసమొచ్చేటి పోరలు కూసోనుండ్రు. పక్కనుండె మల్లేసం నడిగినా ఏమయిందని...
"పొద్దుటేళ పోరలు కాయలకొచ్చిండ్రంట, అప్పటికే యాదమ్మ ఇంట్లా కింద పడి ఉన్నదంట, పాపం పోరలు లేపి మంచమ్మీదట పండుకోబెట్టి, ఆ రమేష్ డాక్టర్ని పిలుచుకొచ్చిండ్రు, డాక్టర్ సూది మందేసి, మింగనీకి గోళీలు యిచ్చి పోయిండంట.
అప్పటి సంధి ఆ పోరలే ధూపిచ్చి, ఇడ్లీ గిట్టా పెట్టి చూస్తన్నరు, ఆళ్ళని గెసుంటి తిట్లు తిట్టె సూడు కడకి ఆళ్ళే కాపాడిండ్రన్నట్టు" మల్లేసం మాటలింటా యాదమ్మని చూస్తున్నా...
"యాదమ్మా! నువ్వు లేచినేళ మంచిదన్నట్టు, ఆ దేవుడే పోరల్లెక్క వచ్చి కాపాడిండు, లేపోతే రేపీయాల్టికి నిన్ను బొందలో పెట్టేటోళ్శు" మందిలో నుండి ఎవరో అన్నారు.
యాదమ్మ సుట్టూ ఉన్న పోరలొంక చూస్తాంది, పోరడొకడు ఆమె చెయ్యి మీద నిమురుతా కూర్చుండు.
"రేయ్ అయ్యా! మిమ్మల్ని గెసుంటి మాటలంటి కదరా! అయినా ఈ ముసల్దాని మీద కోపం లేకపోయె, ఆ గోడ పక్క పెద్ద గెడ ఉండాది, తెచ్చుకోండ్రి, మీకేం కాయలు కావాల్నో కోసుకోండ్రి, ఎప్పుడు కావాల్నన్నా లోనకొచ్చి తెంపుకోండి బిడ్డా" యాదమ్మ కళ్ళలో పోరల్ని తిట్టినానన్న బాధ కనబడుతుండే.
✍ venkatniyogi

4 comments:

చేయెత్తి జైకొట్టు తెలుగోడా!

చిత్రం:పల్లెటూరు (1952), రచన:వేములపల్లి శ్రీకృష్ణ సంగీతం:ఘంటసాల, గానం:ఘంటసాల, బృందం పల్లవి: చేయెత్తి జైకొట్టు తెలుగోడా! గతమెంతో ఘనకీ...